Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి

P Madhav Kumar


ఎల్ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్లియర్ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం 25 శాతం రాయితీని కూడా ప్రకటించింది. అయితే దరఖాస్తు చేసుకున్నవాళ్లు... కట్టాల్సిన క్రమబద్ధీకరణ ఫీజు వివరాలను ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి

ఎల్ఆర్ఎస్
ఎల్ఆర్ఎస్

అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్కీమ్ అమలులో వేగం పెంచేందుకు 25 శాతం రాయితీని ఇస్తోంది. ఇందుకోసం మార్చి 31వ తేదీని గడువుగా కూడా నిర్ణయించింది. ఈ తేదీలోపు ఫీజు చెల్లించినవారికి మాత్రమే... రాయితీ నిర్ణయం వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది.

రాయితీ వర్తింపు…!

ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం కావటంతో... చాలా మంది దరఖాస్తుదారులు రెగ్యూలరైజ్ చేసుకునే పనిలో పడ్డారు. లేఔట్ లో లేదా బయటి ప్రాంతంలో ప్లాట్ కోనుగోలు చేసుకున్న చాలా మంది... ప్రభుత్వం నిర్ణయంచిన ఫీజులను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవటం ద్వారా... లబ్ధి చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు ఎల్‌ఆర్‌ఎస్‌ కటాఫ్‌ తేదీ నాటికి మార్కెట్‌ విలువలో 14 శాతం ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలపైనా కూడా ఈ రాయితీ లభించనుంది.

రాయితీ నిర్ణయంతో దరఖాస్తుదారులు చెల్లించాల్సిన మొత్తంలో నాలుగో వంతు మినహాయింపు వచ్చినట్లే అవుతుంది. భూముల విలువలు అధికంగా ఉన్న చోట ఇది భారీ ఊరటగానే చెప్పొచ్చు. తాజాగా చేసిన సవరణల ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ కటాఫ్‌ తేదీ (26.08.2020) నాటికి లేఅవుట్‌లో కనీసం పది శాతం ప్లాట్లు విక్రయిస్తే.. మిగతా విక్రయించని ప్లాట్లను కూడా ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక ప్రస్తుతానికి క్రమబద్ధీకరణ ఫీజు మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలు కూడా ఉంది. మిగతా 14 శాతం ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలు భవన నిర్మాణ అనుమతుల సమయంలో చెల్లించుకునే వీలు ఉంది. అయితే మీ ఫీజు వివరాలను ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూడండి…..

LRS ఫీజు వివరాలను ఇలా చెక్ చేసుకోండి:

  • ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల ఎల్ఆర్ఎస్ తెలంగాణ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ఈ వెబ్ సైట్ లోకి వెళ్లగానే ఆఫీసియల్ లాగిన్, సిటిజన్ లాగిన్ కనిపిస్తుంది. ఇందులో మీరు సిటిజన్ లాగిన్ పై నొక్కాలి.
  • ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి. మీకు ఓటీపీ వస్తుంది.ఆ నెంబరును ఎంట్రీ చేయాలి.
  • వెరిఫైయిడ్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ హోం పేజీలో LRS Plot Fee Payment, LRS Layout Fee Payment ఆప్షన్లు ఉంటాయి. మీరు దేనికైతే దరఖాస్తు చేశారో అందుకు అనుగుణంగా... ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ వివరాలు కనిపిస్తాయి.
  • దీంట్లోనే చివర్లో ఫీజు వివరాల ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  • ఇందులో రెగ్యులరైజేషన్ ఛార్జీలు, ఓపెన్ స్పెస్ ఛార్జీల వివరాలు కనిపిస్తాయి.

మీ దరఖాస్తుకు అధికారుల నుంచి అప్రూవ్ వస్తేనే ఛార్జీల వివరాలు డిస్ ప్లే అవుతాయి. లేకపోతే నో డాటా అని కనిపిస్తుంది. అప్రూవ్ అయిందా లేదా అనేది కూడా ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్ లోనే తెలుసుకోవచ్చు.మీ దరఖాస్తుకు అప్రూవ్ వచ్చినట్లు ఉంటే.... ఫీజు వివరాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా.... వెబ్ సైట్ లో ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా కూడా ఫీజు చెల్లించవచ్చు. అయితే వెబ్ సైట్ లో తరచు సమస్యలు వస్తున్నాయంటూ పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు.

Tags
Chat