Rain Alert : రెయిన్ అలర్ట్.. హైదరాబాద్‌సహా తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలు.. ఈదురుగాలులు.. పిడుగులు పడే‌చాన్స్.. హెచ్చరికలు జారీ..

P Madhav Kumar

Rain Alert : తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం, గురువారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో గంటకు 50నుంచి 60కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

  • తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్
  • ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • ఈదురుగాలులతోపాటు పిడుగులు పడే చాన్స్
  • హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

Rain Alert : తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. పలు జిల్లాల్లో పగటిపూట రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు కూడా తోడుకావడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బయపడుతున్నారు. అయితే, బుధవారం కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలో మంగళవారం రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. భద్రాచలంకొత్తగూడెం జిల్లాలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు, రామగుండం జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఎండల తీవ్రతకు మంగళవారం ఒక్కరోజే 45మంది మృతి చెందారు. ఇవాళ కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

బుధవారం పది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీచేసింది. కరీంనేగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహూబాబాద్, వరంగల్ జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఇదే సమయంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

బుధవారం తెలంగాణలోని అత్యధిక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా పశ్చిమ, సౌత్, సెంట్రల్ తెలంగాణ జిల్లాలైన కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే సమయంలో ఈ జిల్లాల్లో గంటకు 50నుంచి 60కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

మంగళవారం రాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. బుధవారం తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. అయితే, బుధవారం, గురువారాల్లో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Tags
f