Telangana Weather : తెలంగాణలో మూడు రోజులు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇదే సమయంలో రాష్ట్రంలోకి రుతుపవనాల ఎంట్రీపై కీలక అప్డేట్ ఇచ్చింది. అప్పటి వరకు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.
- తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
- రానున్న మూడు రోజులు ఇదే పరిస్థితి
- పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ
- రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్
Telangana Weather : తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందంటే.. దాదాపు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46డిగ్రీల మార్కును దాటగా.. మరో ఆరు జిల్లాల్లో 45డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, వచ్చే వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని రుతుపవనాల ఎంట్రీపై కీలక అప్డేట్ ఇచ్చింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ.. భానుడు భగభగలు ఏమాత్రం తగ్గడం లేదు. అయితే, నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తేనే ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాది వానాకాలం ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని, జూన్ ఐదో తేదీ తరువాతే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ దక్షిణ ప్రాంతాన్ని ఈనెల 25న నైరుతి రుతుపవనాలు తాకుతాయని తొలుత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాల కదలికల్లో వేగం తగ్గింది. ఇప్పటి వరకు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో విస్తరిస్తూ వచ్చిన పవనాలు, శ్రీలంక సగం వరకు వచ్చి నిలిచిపోయాయి. ఈ ఏడాది వానాకాలంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఐఎండీ (భారత వాతావరణ శాఖ) ప్రకటించింది. అయితే, వాస్తవానికి మే నెల చివరి నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఈసారి జూన్ 5వ తేదీ తరువాతనే రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఉంటుందని, అప్పటి వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో మంగళ, బుధ, గురువారాల్లో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని పేర్కొన్న వాతావరణ శాఖ.. మంగళవారం నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 45డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని తెలిపింది. తొమ్మిది జిల్లాల్లో వడగాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, బుధ, గురువారాల్లోనూ వడగాలులు వీస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, కొన్ని జిల్లాల్లో మాత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
