
ఆధునిక సమాజంలో సంపాదన కొందరికే ఉన్నా.. అనారోగ్యం అందరికీ ఉందని.. స్వామి పరమార్థ దేవ్ వ్యాఖ్యానించారు. అధిక సంపాదన ఒత్తిడికి, రోగాలకు కారణమవుతుందన్నారు. బీపీ, షుగర్ లాంటి అనేక రుగ్మతలు అందరిలో కనిపిస్తున్నాయని.. మందుల ద్వారా మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని వివరించారు.
ఖర్చు లేకుండా..
యోగా సాధన ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఖర్చు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని స్వామి పరమార్థ దేవ్ చెప్పారు. అనుకూల సమయంలో హాయిగా యోగా చేయడం ద్వారా.. ఏ వ్యాధినైనా తగ్గించుకోవచ్చని వివరించారు. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన అంశమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అందరూ గమనించి యోగా సాధనపై దృష్టిపెట్టాలన్నారు.
మనస్సును శుద్ధి చేసుకోవచ్చు..
'ప్రాణాయామం ద్వారా శరీరం రోగరహితంగా, శక్తివంతంగా అవుతుంది. యోగాసనాల ద్వారా శరీరం బలంగా తయారు అవుతుంది. ధ్యానం ద్వారా మనసును శుద్ధి చేసుకోవచ్చు. విద్యార్ధులు ఏకాగ్రతను పెంచుకోవచ్చు' అని స్వామి పరమార్థ దేవ్ వివరించారు. శిక్షణ అనంతరం జీవన విధానం గురించి విశ్లేషణాత్మక సదస్సు నిర్వహించారు. ఇందులోనూ స్వామి పరమార్థ దేవ్ పాల్గొని ప్రాచీన జ్ఞానాన్ని, ప్రాముఖ్యతను వివరించారు.
ఆసక్తికరమైన చర్చలు..
జీవన సూత్రాలు, మానసిక ప్రశాంతత, ఆత్మశాసనం, సమగ్ర శ్రేయస్సు గురించి విద్యార్థులకు స్వామి పరమార్థ దేవ్ వివరించారు. వేదాలు రోజువారీ జీవితంలో వ్యక్తిగత పురోగతికి ఎలా సహాయపడతాయో వివరించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికత, నైతికత, చైతన్య జీవన విధానంపై ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు వేద జ్ఞానం గురించి తెలుసుకున్నారు. ప్రేరణ పొందారు.