పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత భయానక స్థాయికి చేరుకున్నాయి. అమెరికా మద్దతు ఉన్న ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు మూడో రోజుకు చేరుకున్న వేళ.. గడిచిన 72 గంటల్లో ఊహించని పరిణామాలు సంభవించాయి. ఇరు పక్షాల పోరులో వందలాది మంది నిర్దోషులు ప్రాణాలు కోల్పోతుండగా.. ఆ ప్రాంతం మొత్తం అస్థిరతలో చిక్కుకుంది.
ఖమేనీ అంతం: ఒక శకం ముగిసింది
యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఒక కీలక భవనంపై అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేశాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరిస్తూ.. "నెలల తరబడి సాగిన పక్కా ఇంటెలిజెన్స్ ప్లానింగ్‌తోనే ఖమేనీని హతమార్చాం" అని పేర్కొన్నారు. ఖమేనీ మరణంతో రగిలిపోతున్న ఇరాన్.. తన ప్రతీకార జెండా ఎగురవేసి తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులకు సిద్ధమైంది
కువైట్ గగనతలపై ఎఫ్-15 ఫైటర్ జెట్ కూల్చివేత
సోమవారం నాటి పోరులో ఇరాన్ ఓ భారీ విజయాన్ని ప్రకటించింది. కువైట్ ఆకాశంలో ఎగురుతున్న ఒక ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను తమ క్షిపణి వ్యవస్థతో కూల్చివేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇరాన్ విడుదల చేసింది. అందులో ఓ యుద్ధ విమానం మంటల్లో చిక్కుకుని, తోక భాగం నుంచి పొగలు కక్కుతూ నెమ్మదిగా కిందకు పడిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విమానం అమెరికాదా లేక ఇజ్రాయెల్‌దా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పైలట్లు ఇద్దరు పారాచూట్ల సాయంతో క్షేమంగా బయటపడినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.

