బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణించడం, ఇరాన్ కూడా అమెరికా ఆస్తులే లక్ష్యంగా ప్రతిదాడులు చేపడుతుండడంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు వేగంగా స్పందించే స్వభావం కలిగిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ వీటి ధరలకు రెక్కలొచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్సు (దాదాపు 31 గ్రాములు) ధర 5,410 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్సు సుమారు 96 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 91.45గా ఉంది. దీన్ని అనుసరించి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మధ్యాహ్నం 1 గంట సమయంలో 10 గ్రాముల మేలిమి పసిడి (24 క్యారెట్లు) రూ.1.73 లక్షలు (పన్నులు కలుపుకొని) పలుకుతోంది. వెండి కిలో ధర మళ్లీ రూ.3 లక్షల మార్కు దాటింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలోనూ (MCX) వీటి ధరలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ కాంట్రాక్ట్ 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులోనే దాదాపు ఐదు శాతం పెరిగి రూ.1.69 లక్షలకు చేరింది. అంటే ఒక్క రోజులోనే రూ.6 వేలు పైనే పెరిగింది. మే నెల కాంట్రాక్ట్ కిలో వెండి ధర కూడా రూ.15 వేలకు పైనే పెరిగి రూ.2.97 లక్షల వద్ద ట్రేడవుతోంది. యుద్ధ సమయాల్లో స్టాక్ మార్కెట్లు, కరెన్సీలు అస్థిరతకు లోనవుతాయి. దీంతో పెట్టుబడిదారులు తమ డబ్బును నష్టపోకుండా కాపాడుకోవడానికి బంగారం, వెండిని సురక్షితమైన మార్గాలుగా భావిస్తారు. యుద్ధం వల్ల సఫ్లై చెయిన్ దెబ్బతిని ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీ విలువ తగ్గుతుంది. అందుకే ఇలాంటి సమయాల్లో బంగారం, వెండిలోకి పెట్టుబడులు పెద్దమొత్తంలో వెళుతుంటాయి.

