ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఈ ప్రస్తుత యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక రంగాలపై తీవ్రప్రభావం చూపే అవకాశముంది. ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే భారత్‌పైనా గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో మన ఆర్ధిక నిపుణులు పశ్చిమాసియాలోని పరిణామాలను నిశితంగా గమనిస్తూ, ముఖ్యంగా చమురు ధరలు మరియు ట్యాంకర్ల రవాణాపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నారు.
యుద్ధ వాతావరణం పై మోదీ తీవ్ర ఆందోళన
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక ప్రభావాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని అధికారులు చెబుతున్నారు.మరోవైపు భారత ప్రధాని మోదీ కూడా ప్రస్తుత యుద్ధ వాతావరణం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వివాదాలను చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవడానికి భారత్ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు
.యుద్ధంతో చమురు ధరలు పెరిగే ఛాన్స్
భారత్ ఇతర దేశాలతో ముఖ్యంగా గల్ఫ్ దేశాలతో జరిపే వాణిజ్యంపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతం నుంచి ముడి చమురు, గ్యాస్ దిగుమతులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో అంతరాయం కలిగితే దేశీయంగా ఇంధన ధరలు పెరగడం తప్పదని నిపుణులు భావిస్తున్నారు.
ఆర్ధిక నిపుణుల హెచ్చరిక
ఇప్పటికే ముడి చమురు ధరలు సుమారు 10 శాతం పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.91.32కు చేరగా, స్టాక్ మార్కెట్లలోనూ అస్థిరత కనిపించింది. ముఖ్యంగా భారత్ మార్కెట్లు రోజూ నష్టాలను చవి చూస్తున్నాయి.ప్రత్యేకంగా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ మూసివేత జరిగితే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యుద్ధ ప్రభావం దిగుమతులే కాదు ఎగుమతుల పైన కూడా
దిగుమతుల పైన మాత్రమే కాదు ఎగుమతులపైనా యుద్ధ ప్రభావం ఉండొచ్చు. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యే బాస్మతి బియ్యం, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశముంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ వంటి దేశాలు భారత ఎగుమతులకు కీలక మార్కెట్లు కాగా ఎగుమతుల పైనా తీవ్ర ప్రభావం పడుతుంది. స్మార్ట్‌ఫోన్‌ల ఎగుమతుల్లో యూఏఈ ప్రధాన భాగస్వామిగా ఉంది.
యుద్ధం వారం దాటితే పప్పు ధాన్యాలపై ధరలు పెరిగే ఛాన్స్
యుద్ధం వారం రోజులు దాటితే పప్పుధాన్యాల ధరలు పెరిగే అవకాశముంది. అదనంగా డిటర్జెంట్లు, బిస్కెట్లు, టూత్‌పేస్టులు, పెయింట్లు, ప్యాకేజింగ్ వస్తువుల తయారీలో చమురు ఉత్పత్తులు కీలకమైనందున వాటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే, పశ్చిమాసియాలో యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే భారత్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

