
E-Shram Card Apply : కరోనా సమయంలో వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల కష్టాలను పరిగణలోకి తీసుకుని, సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ-శ్రమ్ పోర్టల్ ప్రవేశపెట్టింది. 26.08.2021 నుంచి అసంఘటిత రంగ కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది.
అర్హులైన భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు, రిక్షా తొక్కేవారు, ఇళ్లలో పని చేసేవారు, మత్స్యకారులు, ఉపాధి హామీ కార్మికులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు ఈ-శ్రమ్ కార్డులు అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగ కార్మికులకు E-shram కార్డుల నమోదు ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టాయి.
ఏపీలో ఈ-శ్రమ్ కార్డుల క్యాంపులు నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, సీఎస్సీ సెంటర్లు, మీసేవా కేంద్రాల్లో ఈ-శ్రమ్ నమోదు చేస్తారు. ఈ-శ్రమ్ కార్డులను 16 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులే.
ఈ-శ్రమ్ కార్డుతో ప్రయోజనాలు
1). సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు అమలు
2). ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2,00,000లు ఆర్థిక సహాయం
3). ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగిన వారికి రూ.2,00,000లు ఆర్థిక సహాయం
4). ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ.1,00,000 ఆర్థిక సహాయం
5). ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల సమయంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది
కావలసిన డాక్యుమెంట్స్
ఆధార్ కార్డు లేదా ఆధార్ నెంబర్, ఆధార్ లింక్ మొబైల్ ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ పత్రాలు లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు
ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదుకు అర్హతలు
1. 16-59 సంవత్సరాల మధ్య వయస్సున్నవారు ఈ పథకానికి అర్హులు
2. అసంఘటిత రంగ కార్మికులు
3. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేనివారు అర్హులు
4. ఆదాయపు పన్ను పరిధిలోనికి రానివారు అర్హులు
ఈ పథకంలో చేరే విధానం :
ఈ-శ్రమ్ పోర్టల్ నందు రిజిష్ట్రేషన్ కోసం ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరంలేదు. ఉచితంగా పేర్ల నమోదు చేస్తారు. ఆ నమోదు ప్రక్రియ సమీప సీఎస్సీ సెంటర్లు, పోస్ట్ ఆఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాలలో చేస్తారు. సెల్ప్ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా నమోదు చేసుకునే సదుపాయం కలదు. ఈ-శ్రమ్ పథకం కింద నమోదు చేసుకున్న కార్మికులకు 12 అంకెలు నెంబర్ కేటాయిస్తారు. ఈ కార్డు పొందిన వారు ప్రభుత్వం ద్వారా వృత్తి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను పొందవచ్చును.
ఎవరెవరికీ వర్తిస్తుందంటే?
వ్యవసాయ, అనుబంధ ఉపాధి పనివారు, చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవనాల పనివారు, నర్సిరీలు, పాడి పరిశ్రమ, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్స్యకారులు, భవన, దాని అనుబంధ రంగాలలో పనిచేసే వారు, తాపీ పనివారు, తవ్వకం, రాళ్లు కొట్టేపని, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, సానిటరీ, పెయింటర్, టైల్స్, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, ఇటుక సున్నం, బట్టీలు, రిగ్గర్లు, కాంక్రీట్ మిక్సర్, బావులు తవ్వడం, పూడిక తీత, అస్సారెల్-టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రెస్ మేకర్స్, ఆటో మొబైల్, రవాణా రంగం-డ్రైవర్లు, హైల్పర్లు,
చేతి వృత్తుల పనివారు -చేనేత, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, కౌరవృత్తి, బ్యూటీ పార్లరలో పనిచేసేవారు, చర్మకారులు, రజకులు, వీధి వ్యాపారులు, తోపుడు బండి వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు, కల్లుగీత , కళాకారులు, రిక్షా కార్మికులు, బీడీ కార్మికులు, చెత్త ఏరేవారు, ఇళ్లలో పనిచేసే వారు, కొరియర్ బాయ్స్, ఇంటి వద్ద రోగులకు సేవలు అందించేవారు, కమీషన్ మీద వస్తువులు సరఫరా చేసే వారు.
ప్రభుత్వం పథకాల అమలు చేసేవారు - ఎన్ఆర్ఈజీ వర్కర్లు, ఆశావర్కర్లు, డ్వాక్రా మహిళలు, స్వయం సహాయ సంఘాలు, అంగన్వాడీలు, మిడ్ డే మీల్ వర్కర్లు, విద్యా వాలంటీర్లు, గ్రామ, వార్డు వాలంటీర్లు, హమాలీలు, బేకరి పాలు ఉత్తత్పులు, పాస్ట్ ఫుడ్ తయారీదారులు, వలస కార్మికులు.