
కొత్త రేషన్ కార్డుల జారీకి మీసేవా కేంద్రాల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా... భారీ సంఖ్యలో ప్రజలు మీసేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు కాకుండా.. కొత్తగా వచ్చే వాళ్ల నుంచే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కొత్త కార్డు కోసంతో పాటు పాత కార్డుల మార్పులు, చేర్పుల కోసం కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు.
కొత్త రేషన్ కార్డుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అయితే అప్లయ్ చేసిన వాటి స్టేటల్ ఏంటి..? ప్రస్తుతం ఏ స్థితిలో ఉందనే విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. నిమిషాల వ్యవధిలోనే మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటనేది తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి...
- హోం పేజీలో ఎడమవైపు కనిపించే మొదటి ఆప్షన్ FSC Search పై నొక్కాలి.
- ఇక్కడ Ration Card Search అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే FSC Search, FSC అప్లికేషన్ సెర్చ్, Status of Rejected Ration Card Search అనే మూడు ఆప్షన్లు డిస్ ప్లే అవుతాయి.
- ఇందులో మీరు FSC Application Search మీద క్లిక్ చేయాలి. ఇక్కడ MeeSeva Application Search అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- ఇందులో మీ జిల్లా ఎంపిక చేసుకుని, అప్లికేషన్ నెంబర్ బాక్సులో దరఖాస్తు సమయంలో పొందిన మీ- సేవా రసీదు నెంబర్‌ను నమోదు చేయాలి.
- చివర్లో ఉండే సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్‌కు సంబంధించిన వివరాలు కింద డిస్ ప్లే అవుతాయి.
రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులతో పాటు కొత్త కార్డుల కోసం పెద్ద సంఖ్యలో అప్లికేషన్ చేసుకునేందుకు తరలి వస్తున్నారు. దీంతో మీసేవా కేంద్రాలన్నీ జనాలతో కిక్కిరిసిపోతున్నాయి.రేషన్ కార్డుల కోసం భారీగా ప్రజలు తరలివస్తుండటంతో మీసేవా సర్వర్లపై ప్రభావం పడుతోంది. కొన్నిచోట్ల సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో కొన్నిచోట్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది.
ఇక రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని పౌరసరఫరశాఖ స్పష్టం చేసింది. అప్లికేషన్ల సమర్పణకు ఎలాంటి గడువు లేదని క్లారిటీ ఇచ్చింది. దరఖాస్తుదారులు తొందరపడాల్సిన అవసరం లేదని ప్రకటించింది. రేషన్ కార్డుల విషయంలో గందరగోళానికి గురి కావొద్దని సూచించింది. ప్రజాపాలన లేదా గ్రామసభలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయవద్దని తెలిపింది.