శబరిమల బంగారు తాపడాల వ్యవహారం పై క్రిమినల్ కేసు: Criminal case on Sabarimala gold-tapping scandal:
October 11, 2025
కొచ్చిన్: శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారం తాపడం
బరువులో వ్యత్యాసం చోటుచేసుకోవడంపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను కేరళ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు విజిలెన్స్ కమిటి నిర్వహించిన దర్యాప్తును బట్టి బంగారం తాపడాల విషయంలో అవకతవకలు జరిగినట్లు అనిపిస్తోందని జస్టిస్ రాజా విజయరాఘవన్ వి, జస్టిస్ కె.వి. జయకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. "సుమారు 474.9 గ్రాముల బంగారాన్ని ఉన్ని కృష్ణన్ పొట్టి (బంగారు పూత పూయడానికి ముందుకు వచ్చిన స్పాన్సర్)కు ఇచ్చినట్లు విజిలెన్స్ నివేదికలో తేలింది. అయితే ఉన్ని కృష్ణన్ ట్రావెన్కోర్ దేవస్థానం (టీడీబీ)కి ఎంత బంగారం ఇచ్చాడన్న విషయాన్ని మాత్రం రికార్డులు తెలపలేదు" అని హైకోర్టు పేర్కొంది. తాపడాల వ్యవహారాన్ని సమగ్రంగా దర్యాప్తు చేయాలని సిట్ను ఆదేశించింది. ఆరు వారాల్లోగా నివేదికను సమర్పించాలని, ప్రతి రెండు వారాలకు ఒకసారి దర్యాప్తు పురోగతిని కోర్టుకు తెలియజేయాలని స్పష్టం చేసింది. శబరిమల గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాల తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలు. తిరిగి వాటిని బిగించినప్పుడు బరువు తగ్గింది.
Tags
