New FASTag rules: ఫిబ్రవరి 17 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఫాస్టాగ్ వినియోగదారులు పెనాల్టీలను, అదనపు చార్జీలను తగ్గించుకోవడానికి ఈ కింద వివరించిన సూచనలు పాటించాలి.

New FASTag rules: ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లింపులు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మారబోతున్నాయి. 2025 ఫిబ్రవరి 17 నుంచి టోల్ ప్లాజాల వద్ద లావాదేవీలు సజావుగా జరిగేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ధ్రువీకరణ నిబంధనలను అమలు చేయనుంది. అందుకు అనుగుణంగా, వినియోగదారులు తమ ఫాస్టాగ్ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే, ఎప్పటికప్పుడు, తమ ఫాస్టాగ్ అకౌంట్ లను అప్ డేట్ చేసుకోవాలి. అలా చేయడంలో విఫలమైన ఫాస్టాగ్ వినియోగదారులు పెనాల్టీలు, అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
ఫాస్టాగ్ ధ్రువీకరణలో కీలక మార్పులు
జనవరి 28, 2025 న జారీ చేసిన తాజా ఎన్పీసీఐ సర్క్యులర్ ప్రకారం, ఫాస్టాగ్ లావాదేవీలు ఇప్పుడు స్కానింగ్ సమయం, అకౌంట్ స్టేటస్ ఆధారంగా ధృవీకరించబడతాయి. అలాగే, రెండు సమయ ఆధారిత షరతులు కూడా రానున్నాయి.
- 60 నిమిషాల నియమం: స్కానింగ్ చేయడానికి 60 నిమిషాల కంటే ఎక్కువ ముందు ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లో ఉంటే లేదా తక్కువ బ్యాలెన్స్ ఉందని మార్క్ చేస్తే, ఆ లావాదేవీ తిరస్కరించబడుతుంది.
- 10 నిమిషాల నిబంధన: స్కానింగ్ చేసిన 10 నిమిషాల్లో ఫాస్టాగ్ ను బ్లాక్ లిస్ట్ లో పెడితే, టోల్ ఫీజును ప్రాసెస్ చేయవచ్చు. కానీ అదనంగా, జరిమానాలు విధించవచ్చు.
ఎన్పీసీఐ రూల్స్ కు అనుగుణంగా
ఒక ఫాస్టాగ్ ఖాతా ఎన్పీసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే, ఎర్రర్ కోడ్ 176 తో లావాదేవీలు తిరస్కరించబడతాయి. అంటే అనుమతించిన పరిమితికి మించి ఫాస్టాగ్ ఇన్ యాక్టివ్ గా ఉంటే టోల్ పేమెంట్ ప్రాసెస్ చేయబడదు.
విఫలమైతే జరిమానాలు
ఎన్పీసీఐ జారీ చేసిన తాజా మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే, పెనాల్టీలు, లేదా ఆర్థిక జరిమానాలకు దారితీస్తాయి. ఏదైనా ఫాస్టాగ్ లావాదేవీ తిరస్కరణకు గురైతే, రెట్టింపు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే టోల్ ప్లాజా వద్ద స్కాన్ చేసిన 10 నిమిషాల్లో వినియోగదారుడు తమ ఖాతాను రీఛార్జ్ చేసుకుంటే, వారు జరిమానాల నుండి తప్పించుకోవచ్చు. స్టాండర్డ్ టోల్ మొత్తాన్ని చెల్లించవచ్చు.
నివారణకు చర్యలు
ఫాస్టాగ్ వినియోగదారులు ప్రయాణం ప్రారంభించే ముందు తమ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫాస్టాగ్ అకౌంట్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలి. కేవైసీ వివరాలను అప్ డేట్ చేసుకుని, బ్లాక్ లిస్ట్ లో పడకుండా చూసుకోవాలి. ఫాస్టాగ్ ఖాతాలను యాక్టివ్ గా ఉంచడం వల్ల అనవసరమైన ఛార్జీల బారిన పడకుండా ఉంటారు. టోల్ ప్లాజాల వద్ద లావాదేవీ వైఫల్యాలు, ఇతర వివాదాలను తగ్గించడానికి ఈ మార్పులు సహాయపడతాయని, వినియోగదారులందరికీ టోల్ వసూలు మరింత సమర్థవంతంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.