'TRS' టైటిల్ పై కవితకు బిగ్ షాక్, BRS ఫిర్యాదుతో కీలక మలుపు..!?

P Madhav Kumar


 కవిత ప్రారంభించిన కొత్త పార్టీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కవిత తన పార్టీ పేరుగా టీఆర్ఎస్ ప్రకటించారు. ఈ పేరుపై ఇప్పటికే పలు అభ్యంతరాలు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) దృష్టికి వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న 'తెలంగాణ రాష్ట్రసామాజిక సేన' కూడా 'టీఆర్ఎస్' అనే పేరు తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. సోలాపూర్‌కు చెందిన దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ ఈ మేరకు కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే ఈసీఐకి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఇక కవిత పార్టీ పేరుపై భారత్ రాష్ట్ర సమితి (BRS) కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ఈసీ తుది నిర్ణయం ఏంటి..?

14 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 'TRS' అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను 'టీఆర్ఎస్'గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది. అదే విధంగా కవిత పత్రికల్లో ఇచ్చిన ప్రకటనపై కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 'TRS' పేరును కేటాయించడంపై దాదాపు 600 నుంచి 700 వరకు ప్రజా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే 'TRS' పేరుతో నమోదైన మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 'తెలంగాణ రాజ్య సమితి' పేరుతో నమోదైన మరో రాజకీయ పార్టీ కూడా 'TRS' పేరును ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీంతో, ఈ అభ్యంతరాల పైన కవిత టీం ఏ రకంగా సమాధానం ఇస్తుంది.. ఈసీ తుది నిర్ణయం ఏంటనేది ఉత్కంఠగా మారుతోంది.
f