నాలుగు రోజులు ఎండలు దంచుడే
తాజాగా రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు చాలా అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో రెండు నుండి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ జిల్లాలలోనే అధిక ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, గద్వాల, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలను ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, కాబట్టి ఆ ప్రాంతాలలోని ప్రజలు ఎండల సమయంలో బయటికి వెళ్లకుండా ఉంటే మంచిదని పేర్కొంది. ఈ జిల్లాలలో ముఖ్యంగా ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఎండలపై ప్రజల్లో ఆందోళన
రాష్ట్రంలోని మిగతా జిల్లాలలో 36 డిగ్రీల సెల్సియస్ కంటే టెంపరేచర్ తక్కువగా నమోదైనా ప్రజలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అప్పుడే కూలర్లను, ఏసీ లను ఆశ్రయిస్తున్నారు. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్న క్రమంలో ఏప్రిల్, మే నెలలో ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో అని ఇప్పటినుండే భయపడుతున్నారు.
ఎండలతో జాగ్రత్త .. వాతావరణ శాఖ అలెర్ట్
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతాయని, రానున్న నాలుగు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని, పలు జిల్లాలలో ఎండలు మండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండలు ముదురుతున్న వేళ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ సూచించింది.

