తిరుపతి (నగరపాలిక, మంగళం), న్యూస్టుడే: తిరుపతి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలో చిరుత కలకలం సృష్టించింది. అన్నివైపులా తలుపులు బిగించి ఉన్న అక్కడి క్లినికల్ విభాగంలో సోమవారం ఉదయం తలుపులు తీయగానే చిరుత (ఏడాదికి పైగా వయసున్న) ప్రత్యక్షం కావడంతో అటెండర్ భయంతో పరుగులు తీశారు. అంతలో సిబ్బంది అక్కడకు రాగా.. వారిపై అది దాడికి యత్నించింది. అనంతరం అక్కడి మరుగుదొడ్లోకి వెళ్లి దాక్కుంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది.. భవనానికి తాళాలు వేసి ఉన్నతాధికారులకు విషయం చేరవేశారు. హనుమాన్ రెస్క్యూ బృందం వలలు, బోను, మత్తుమందు ప్రయోగించే పరికరాలతో అక్కడికి చేరుకుని మూడుగంటలు శ్రమించి చిరుతను బంధించింది. ప్రస్తుతం దాని ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని రోజుల పాటు ఎస్వీ జూ వైద్యుల పర్యవేక్షణలో ఉంచి తర్వాత శేషాచలంలో వదిలిపెడతామని అధికారులు వెల్లడించారు. భవనం వెనకున్న చెట్టు ఎక్కి అది లోపలకు ప్రవేశించినట్లు వర్సిటీ అధికారులు భావిస్తున్నారు.