ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఆగస్ట్ 21వ తేదీన ప్రధాని మోదీ పోలాండ్‌కు చేరుకోనున్నారు. అనంతరం ఆగస్ట్ 23న ఉక్రెయిన్‌లో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

న్యూఢిల్లీ, ఆగస్ట్ 19: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఆగస్ట్ 21వ తేదీన ప్రధాని మోదీ పోలాండ్‌కు చేరుకోనున్నారు. అనంతరం ఆగస్ట్ 23న ఉక్రెయిన్‌లో ఆయన పర్యటించనున్నారు.
ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తమ దేశాల్లో పర్యటించాలని పోలాండ్ ప్రధాని డోనాల్డ్ డస్క్‌తోపాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ నుంచి ప్రధాని మోదీకి ఆహ్వానం అందిందని పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ఆ యా దేశాల నేతలతో కీలక చర్చలు జరుపుతారని పేర్కొంది.
30 ఏళ్ల అనంతరం భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి అని గుర్తు చేసింది. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం కొనసాగుతుందని.. అలాంటి వేళ.. ఈ ఇరు దేశాలతో దౌత్యపరంగా, చర్చలు పరం భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఈ రెండు దేశాల మధ్య శాంతి స్థాపన నెలకొనాలని భారత్ ఆకాంక్షిస్తుందని స్పష్టం చేసింది.
ఇక 45 ఏళ్ల అనంతరం పోలాండ్‌లో భారత ప్రధాని పర్యటిస్తున్నారని పేర్కొంది. భారత్, పోలాండ్ మధ్య దైపాక్షిక చర్యలు ప్రారంభమై 70 ఏళ్లయిందని పేర్కొంది. అలాంటి వేళ.. ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించకుందని వివరించింది. ఇది ఈ ఇరు దేశాలకు ఒక మైలురాయి అని గుర్తు చేసింది.
పోలాండ్‌లో 25 వేల మంది భారతీయులు ఉంటే.. వారిలో 5 వేల మంది విద్యార్థులు ఉన్నారని వివరించింది. ఇటీవల ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్దం జరిగిందని గుర్తు చేసింది. ఆ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న దాదాపు 4 వేల మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించడంలో పోలాండ్ కీలక పాత్ర పోషించిందని వివరించింది.
అలాగే పోలాండ్‌తో భారత్ దశాబ్దాలుగా కొనసాగిస్తున్న స్నేహపూర్వక అనుబంధాన్ని ఈ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. రెండో ప్రపంచ యుద్ద సమయంలో పోలాండ్ మహిళలు, చిన్నారులకు భారత్ అందించిన సహాయ సహకారాల పట్ల పోలాండ్ నేటికి కృతజ్ఞత భావంతో ఉంటుందని స్పష్టం చేసింది.
