గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్‌లలో తీవ్ర అస్థిరత నెలకొన్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు రాలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటాయని సూచించింది.
ఈ పరిణామాల మధ్య హైదరాబాద్‌లో పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడం కలకలం రేపింది. పెట్రోల్ కొరత ఏర్పడవచ్చనే వార్తలు రావడంతో వాహనదారులు వాటి ముందు క్యూ కట్టారు. అదే సమయంలో స్టాక్ లేకపోవడం వల్ల ఉప్పల్, మల్లాపూర్, ఘట్‌కేసర్ వంటి కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడటం వాహనదారులను మరింత భయాందోళనలకు గురి చేసింది. దీంతో దగ్గరర్లో ఉన్న బంకులకు పరుగులు తీశారు.
ఫిల్లింగ్ స్టేషన్లలో కార్లు, బైక్‌లు, ఆటో రిక్షాల క్యూ కనిపించాయి. సీఎన్‌జీ అవుట్‌లెట్‌ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆటో రిక్షాలు, కార్లు నాలుగు నుంచి అయిదు గంటలు పడిగాపులు పడ్డాయి. ఇది- నగరంలో ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. ముఖ్యంగా నాంపల్లి టీ- జంక్షన్ నుండి పబ్లిక్ గార్డెన్ రోడ్ వైపు ఆటో రిక్షాల క్యూల వల్ల రాకపోకలు నెమ్మదించాయి. దీనివల్ల వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాల్సి వచ్చింది.
ఈ పరిణామాలపై తెలంగాణ వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ స్పందించింది. పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎటువంటి కొరత లేదని, స్పష్టం చేసింది. రిఫైనరీల నుండి స్థానిక డిపోల వరకు సప్లై చైన్ పూర్తిస్థాయిలో పని చేస్తోందని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పీజీ వంట గ్యాస్ లో ఎటువంటి కొరత ఏర్పడలేదని వివరించింది. రోజువారీ అవసరాలను తీర్చడానికి తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.
ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61

