ధన్వాడ: "దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదు" అన్న చందంగా తయారైంది ధన్వాడ మండలంలోని చేయూత పింఛన్ దారుల పరిస్థితి. ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులు ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ, బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా పంపిణీలో తీవ్ర జాప్యం జరిగింది.
తమ చేతికి రావాల్సిన వెయ్యి, రెండు వేల రూపాయల కోసం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు గత కొన్ని రోజులుగా అల్లాడిపోయారు. ఎండను కూడా లెక్కచేయకుండా ప్రతిరోజూ ధన్వాడ పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగి, అధికారులు ఇచ్చే సమాధానంతో నిరాశగా వెనుదిరిగేవారు. అధికారుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన లబ్ధిదారులు ఇటీవల రోడ్డెక్కి నిరసన కూడా తెలిపారు.
ఈ క్రమంలోనే వృద్ధుల కష్టాలను, అధికారుల అలసత్వాన్ని వివరిస్తూ మే 6న 'దిశ' దినపత్రికలో ప్రచురితమైన కథనం అధికారుల్లో కదలిక తెచ్చింది. ఈ వార్తకు స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే నిధుల విడుదలకు ఆదేశించారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి అధికారులు పింఛన్ డబ్బుల పంపిణీని ప్రారంభించారు. తమ గోడును వినిపించి, పింఛన్ వచ్చేలా చేసిన 'దిశ' పత్రికకు లబ్ధిదారులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
