Degree Students : రాష్ట్ర ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్న 11కోర్సుల ద్వారా విద్యార్థులు డిగ్రీ పూర్తిచేసుకున్న తరువాత ఉపాధి అవకాశాలు మెండుగా లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కోర్సులు
- చివరి ఏడాది నెలకు రూ.7 వేల స్టైపెండ్
Degree Students : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ విద్యార్థులకు సంప్రదాయ విద్యతోపాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంకు 11 కొత్త అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (AEDP) కోర్సును అందుబాటులోకి తెచ్చారు. మూడేళ్ల కాలపరిమితి గల డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులు తమ చివరి సంవత్సరం అంతా క్షేత్ర స్థాయిలో వివిధ పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలు, లేదా ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ప్రత్యక్షంగా శిక్షణ పొందాల్సి ఉంటుంది.
డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఉపాధి లభించేలా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత విద్యా సంవత్సరంలో 16రకాల కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం మరో 11 కోర్సులు అందుబాటులోకి తేవడంతో.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 94 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 27రకాల ఏఈడీపీ కోర్సులు అందుబాటులో ఉండనున్నాయి. అయితే, గతేడాది 16 కోర్సులకుగాను 6వేల సీట్లు అందుబాటులో ఉండగా.. కేవలం 1,770 మంది మాత్రమే చేరారు. ఈసారి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సులను చేర్చడంతోపాటు గతంకంటే మరో 5వేలు సీట్లు అందనంగా పెంచారు. దీంతో 11వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2026-27విద్యా సంవత్సరంలో కనీసం 8వేల సీట్లు భర్తీ చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురానున్న 11కోర్సుల ద్వారా విద్యార్థులు డిగ్రీ పూర్తిచేసుకున్న తరువాత ఉపాధి అవకాశాలు మెండుగా లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. డిగ్రీ చివరి సంవత్సరం అంతా క్షేత్ర స్థాయిలో వివిధ పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలు లేదా ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో విద్యార్థులు ప్రత్యక్షంగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆ అప్రెంటిస్షిప్ సమయంలో విద్యార్థులకు ఆర్థిక భరోసాగా నెలకు రూ.7వేల చొప్పున స్టైపెండ్ కూడా చెల్లించనున్నారు.
ఇదిలాఉంటే.. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జూన్ 12న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పలు ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలతో ఉన్నత విద్యాశాఖ అధికారికంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ప్రత్యేక కోర్సుల ద్వారా అప్రెంటిస్షిప్ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిలో 80నుంచి 90శాతం మందికి వారు శిక్షణ పొందిన సంస్థల్లోనే శాశ్వత ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.
